పంథా మార్చిన జక్కన్న.. మహేశ్‌ సినిమా షూటింగ్‌కు లాంగ్ బ్రేక్!

  • మహేశ్‌-రాజమౌళి సినిమా షూటింగ్‌కు మే నెల మొత్తం బ్రేక్
  • ఎండల తీవ్రత దృష్ట్యా యూనిట్ కోసం జక్కన్న కీలక నిర్ణయం
  • రూ.1400 కోట్ల బడ్జెట్‌తో గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌గా 'వారణాసి'
  • మహేశ్‌ సరసన ప్రియాంక చోప్రా.. విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్
సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి' షూటింగ్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త వెలువడింది. షూటింగ్ షెడ్యూళ్ల విషయంలో ఏమాత్రం రాజీ పడని జ‌క్క‌న్న‌, ఈ సినిమా చిత్రీకరణకు ఏకంగా నెల రోజుల పాటు విరామం ప్రకటించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా నటీనటులు, సాంకేతిక బృందం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక భారీ సెట్‌లో మహేశ్‌ బాబుపై కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ నేతృత్వంలో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట పూర్తి కాగానే, మే నెల మొత్తం షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వాలని రాజమౌళి నిర్ణయించారు. సాధారణంగా చిత్రీకరణలో విరామాలకు ఇష్టపడని జక్కన్న, యూనిట్ శ్రేయస్సు కోసం తన పంథా మార్చుకోవడం విశేషం. ఈ విరామ సమయంలో ఆయన పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పనులపై దృష్టి సారించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ 80 శాతం పూర్తయినట్లు సమాచారం.

భారత సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో సుమారు రూ. 1400 కోట్లకు పైగా వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 'వారణాసి' ఒక గ్లోబ్‌ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రమని, కథాంశం క్రీస్తు శకం 512 నుంచి భవిష్యత్తులోని 2027 వరకు సాగుతుందని తెలుస్తోంది. సోషియో-ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఇది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఈ చిత్రంలో మహేశ్‌ బాబు 'రుద్ర' అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రను హనుమంతుడి లక్షణాల స్ఫూర్తితో రాజమౌళి డిజైన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

మహేశ్‌కు జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా 'మందాకిని'గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రకాశ్‌ రాజ్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రత్యేకంగా 1.43:1 IMAX ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్న తొలి నాన్-ఇంగ్లీష్ చిత్రంగా 'వారణాసి' రికార్డు సృష్టించనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న శ్రీరామనవమి కానుకగా ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

Varanasi Movie
Mahesh Babu
SS Rajamouli
Priyanka Chopra
Prithviraj Sukumaran
Indian cinema
Telugu cinema
action adventure movie
VFX graphics
high budget movie

More Telugu News